Friday, 24 September 2021

ఎడారిలో సెలయేర్లు - సెప్టెంబర్ 25 - Streams in the Desert

  VINAYS INFO       Friday, 24 September 2021

 సెప్టెంబర్ 25 - ఎడారిలో సెలయేర్లు (సంకలనం: శ్రీమతి చార్లెస్ ఇ. కౌమన్; అనువాదం: జోబ్ సుదర్శన్)

_*నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చెనేమి?*_ (కీర్తనలు 42:9).

విశ్వాసీ, ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా? ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడవై తిరుగుతూ ఉంటావేమిటీ? దుఃఖకరమైన ఎదురుతెన్నులతో నిండి ఉంటావేమిటి? రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవరూ చెప్పలేదా? నీ అసంతృప్తి పొగమంచులా పట్టి ఉండగా అది వీడిపోతుందని నీకెవరూ చెప్పలేదా? ఆ మంచు వర్షమై, వర్షం వడగండ్లు, వడగండ్లు తీవ్రమైన తుపానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటున్నావెందుకు? రాత్రిని ఆనుకునే పగలూ, కష్టాన్ని ఆనుకునే సుఖమూ ఉన్నాయని తెలియదా? చలికాలం వెళ్ళిన వెంటనే వసంత కాలం రాదా? నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు నిన్ను నిరాశపరచడు. 


నువ్వు ఇలా అనుకోవాలి. "నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు. నా భయాలన్నింటినీ పోగొడతాడు. విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు. నా కన్నీళ్ళలో వర్షపు ధనుస్సు మెరిసేలా చేస్తాడు. నా దారికి అడ్డు వచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే. అరణ్య మార్గాల్లో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను. నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలనన్నిటినీ బాగుచేశాడు. ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది. ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది. 


నాకు అగోచరమైన దారులగుండా నన్ను నడిపించాడు. ఆయన్ను అనుసరిస్తుంటే వంకరదారులు తిన్ననివైనాయి. మెట్టపల్లాలు చదునైనాయి. దారిప్రక్కన నాకు ఖర్జూరపు చెట్లు, చల్లని నీటి ఊటలు సేదదీర్చాయి. రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది. పగటివేళ మేఘస్థంభం నీడనిచ్చింది. గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థం అయింది. దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్ర లాగా యాజకుడి చేతికర్ర లాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది".

logoblog

Thanks for reading ఎడారిలో సెలయేర్లు - సెప్టెంబర్ 25 - Streams in the Desert

Previous
« Prev Post

No comments:

Post a Comment